Wednesday, September 4, 2019

జగతి కోసం...

జగతి కోసం...
05-09-2019 00:49:03

కవి, వ్యాసకర్త, కాలమిస్ట్, సాహిత్య కార్యకర్త, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ సభ్యురాలు, మిత్రురాలు అయిన జగద్ధాత్రి విషాద మరణం మనకందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంలో ఆమె గురించి మేం పంచుకున్న కొన్ని ఆలోచనలు, ఇపుడు అందరితో మాట్లాడుతున్నాం. సాహిత్యాన్ని విస్తృతంగా చదవడం, రాయడం, నలుగురిలోకి తీసుకు పోవడం ఊపిరిగా జీవించిన ఒక మనిషి నిష్క్రమణం ఆ మేరకు పూడ్చుకోలేని వెలితిని కలిగిస్తుంది. వర్తమాన సాహిత్యంలో కొత్త స్వరాలను గుర్తించడం, నలుగురికీ పరిచయం చేయడంకోసం సమీక్షా వ్యాసాలు రాయడం ఆమె నిరంతర వ్యాసంగం.

ఆధునిక సాహిత్య ప్రారంభంనుంచి ఇప్పటివరకూ ఎంతోమంది సాహిత్యకారుల కృషిని ఆమె అలుపులేని అధ్యయనం ద్వారా చర్చలలో నిలబెడుతూ ఉండేవారు. బుద్ధికి పదును పెట్టే విమర్శని ఒకవైపు నడుపుతూ మరోవైపు తన హృదయ కల్లోల వ్యక్తీకరణకి కవిత్వాన్ని ఆలంబన చేసుకున్నారు. అనేక పుస్తకాల ఆవిష్కరణలను తన చేతుల మీదుగా నిర్వహించిన జగద్ధాత్రి వందలాది సాహిత్య వ్యాసాలను ఇంతవరకూ ఒకచోట చేర్చనే లేదు. పుస్తకరూపంలో వచ్చిన ఆ ఒక్క కవితా ‘సహచరణం’ కూడా అనేక ఒత్తిడుల మధ్య ప్రచురించుకున్నారు. మగవారికి, లేదా ఆధిపత్య వర్గాలకి మాత్రమే పరిమితమైన సాహిత్య కార్యనిర్వహణ రంగంలో జగద్ధాత్రి అవిశ్రాంతంగా పని చేసారు. విశాఖపట్నం కేంద్రంగా మొజాయిక్ సంస్థ నుంచి అనేక సాహిత్య కార్యక్రమాలు చేపట్టారు. మంచి వక్తగా వందలాది సభలలో ప్రసంగించారు. తన చుట్టూ మనుషులతో స్నేహపూర్వకంగా మెలిగేవారు. సాహిత్య సృజన, కార్యాచరణలో ఆమె సహచరుడు రామతీర్థ తనకి చేదోడు వాదోడుగా నిలిచారు.

సహచరుని మరణపు దుఃఖం నుంచి కోలుకోకుండానే జగద్ధాత్రి కూడా జీవితాన్ని చాలించారు. ఈ విషాదం నుంచి సమాజం గ్రహించవలసింది చాలానే ఉంటుంది. అయితే ఆ గ్రహింపు, ఆమె వ్యక్తిగత జీవితంలోని అన్ని విషయాలను పట్టుకుని వ్యాఖ్యానించడం కాదని నమ్ముతున్నాం. గుట్టుగా దాచుకుని, రహస్యంగా మాట్లాడుకునే అనేక విషయాలు బహిరంగంగా మాట్లాడుకోవ డానికి జగద్ధాత్రి జీవితం ఒక సందర్భం కావాలి తప్ప, ఆమె జీవితంలోని ప్రతి ఘటనను తవ్వి తీసి చర్చకి పెట్టడం, తప్పొప్పుల తీర్పులు ప్రకటించడం సబబు కాదు. వైవాహికేతర సంబంధాలు, స్వేచ్ఛాయుత స్త్రీ పురుష సంబంధాలు, వీటికి ఉండే పలు సామాజిక, రాజకీయ ఆర్థిక, సాంస్కృతిక కోణాలు చర్చకి రావాలి. ఆ చర్చ ఏ ఒక్కరి వ్యక్తిగత జీవితాన్నో ఉదాహరణగా చూపేది కాకూడదు. ఇలాంటి పలు ఘటనల సారాంశంగా మన గ్రహింపులోకి వచ్చిన విషయాలను చర్చిద్దాం. ఈ దిశగా జగతి మిత్రులం సెప్టెంబర్ 8, ఆదివారం, విశాఖ పౌర గ్రంథాలయంలో సాయంత్రం 5 గంటలకి - ఒక చర్చా కార్యక్రమం నిర్వహించబోతున్నాం.

జగతి మరణం సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వందలాదిమంది ఆవేదన ప్రకటనలు ఇచ్చారు, పోస్టులు రాసారు, దుఃఖపడ్డారు, సంతాపం తెలిపారు, ఆగ్రహించారు, ఆరోపణలు చేసారు, నిస్సహాయ ఆక్రోశాన్ని వ్యక్తం చేసారు. ఇవన్నీ చూసినపుడు జీవితాన్ని ఇలా ముగించిన జగతి మనలో చాలామందిని కలవరపెట్టారని అనిపించింది. వందలాది మంది చూపిన ఈ చైతన్యం కనీసం ఒక్క పని కోసమయినా ఏకీకృతం కావాలని కోరుతున్నాం. జగతి సాహిత్య వ్యాసాలను ఆమె కుటుంబ సభ్యుల అనుమతితో ప్రచురిద్దాం. ఈ పనిలో మీరంతా తోడు నిలవాలని కోరుతున్నాం. మన మాటలు మాటలుగానే కాక నిర్మాణాత్మక ఆచరణలోకి దారి తీయడానికి అందరం కృషి చేద్దాం.

- కత్తి పద్మ, కె.ఎన్. మల్లీశ్వరి, సాయిపద్మ, విజయభాను కోటే, ఉమా నూతక్కి, మాటూరి శ్రీనివాస్, వివినమూర్తి, అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు, రమణమూర్తి (లీడర్ పత్రిక), ఎం. లక్ష్మి, కె. అనురాధ, నారాయణ వేణు, సుధ(hrf), రఘు(clc), జి,ఎస్. చలం, బాల సుధాకర మౌళి, బమ్మిడి జగదీశ్వరరావు, డి. లలిత, ఎ. అరుణ, అరణ్య కృష్ణ, రమాసుందరి, ఎస్.జె. కళ్యాణి, ఊడుగుల జరీన.

No comments:

Post a Comment